అసమ్మతి

ఎక్కడో ఇరుక్కొని ఉంటాము

పాతబడి దుమ్ముబారి పెళుసులుగా విరుగుతున్న
గోదుమరంగు పేజీల నడుమ
చిన్నప్పుడెప్పుడో దాచుకున్నవన్నెల  నెమలి కన్నులా

ఎప్పటిదో ఒక పాటలా
గొంతుకలో  ఉండీ ఉండీ ఊరుతుంటాము

సుడి తిరుగుతూ ఒక జీరగా
క్షణ మాత్రమే అయినా అప్పటికది
మన లోపలి బీటలు వారుతున్న ఏకాంత గృహంలో
మనకు తెలియకుండానే  పెరిగి ఒక పలకరింపై
మెల్లగ తలనూచే గడ్డి పువ్వులా

ఏవో  తెలియని గాయాలతో
సంచరిస్తూ ఉంటాము

బొటనవేలు పగిలి
చిత్తడయిన పాదాల ముని వేళ్ళతో
ఒక సలపరాన్ని దారి పొడువునా అద్దుతూ
కొనసాగడమొక్కటే ఉపశమనమై జ్వలించీ జ్వలించీ
నెమ్మదినెమ్మదిగా బూడిదబారే వేయి తలల మహా కేతనంలా

ఎప్పుడూ మనం ఎదురీదుతూనే ఉంటాం

కృతకత్వమొక్కటే క్షణానికొక్క ముఖంగా
జగన్మోహనమై ఎల్లెడలా పరివ్యాపితమయ్యే వేళల
శిథిలమై విరిగిపడే ఒక మహా వృక్షపు
పెళపెళారావంలో లయమొందుతున్న ఆత్మలా

జాడ

ఇక్కడ నిన్నుకలుస్తాను

బహుశా ఒకే శిక్షకు గురయిన ఇద్దరు నేరస్తులు మాట్లాడుకుంటున్నట్టుగా, వేళ్ళను కాసింత లోపలికి జొనిపి కొసలకంటిన నెత్తుటిమరకలనూ,కనుకొలుకులలో  ఆరని తడిని ఏదో గొప్ప పనిలో పడి యధాలాపంగా  తుడుచుకుంటున్నట్టుగా

ఇక్కడ నిన్ను కలుస్తాను

మాటలలో పడి,  ఉత్తి మాటలతో మాటాడీ మాటాడీ చివరకు ఎదురుబొదురుగా కూర్చుని అసహాయపునీడ అద్దంలో  ఎవరినివారు చూసుకుంటూ    మోకాళ్ళ నడుమ తలకాయలిరికించుకుని నేలపై వేళ్ళతో ఏవేవో గీతలు గీస్తూ  ఉన్నట్టుండీ దిగ్గున లేచిపోయే ఆ ఇద్దరినీ చూసి పెగిలీపెగలని సన్నని నిట్టూర్పేదో నీకు మాత్రమే తెలిసిన అర్థంతో నీ నుంచీ తొలుచుక వచ్చేందుకు వేదన పడుతున్నప్పుడు

ఇక్కడ నిన్ను కలుస్తాను

కేవలం కవిత్వం  కోసం, కవిత్వం తప్ప మరేమీ కనపడక గుంపులో తల్లి చేతిని విడవకుండా ఒక అప్రమత్తత ఏదో సన్నని వణుకై తన బలహీనపు వేళ్ళతో  పట్టుకొనజూసే పిల్లవాడిలాగా ఒకింత బేలగా,ఇంకా నిను కని పెంచిన తల్లి ముందరయినా దిగంబరంగా సాగిలబడగల ధైర్యాన్ని ప్రోది చేసుకుంటూ,  అపుడపుడయినా జీవితం ముందర భుజాల మీద చేతులు వేసుకుని మాటాడే వాడొకడికోసం వెతుకులాడుతూ

ఇక్కడ నిన్ను కలుస్తాను

రాముడిచ్చిన తీర్పు

ఒకసందర్బాన్ని విశ్వరూపవిన్యాసంలాగా నువ్వు ఊహిస్తావు
కొన్నిపదబంధాలతో రూపుకట్టేందుకు గొప్పప్రయత్నం చేస్తావు

దేహాన్ని చుట్లుచుట్టి బంధింపజూసే
కొండచిలువ ఉచ్చ్వాసనిచ్చ్వాసాల ఊపిరివేడిని
బాధిత ముఖంపై జారిపడే మృత్యుధారగా నువ్వు చిత్రిస్తావు
ఆ క్షణంలో నువ్వే ఒక గొర్రెపిల్లవుగానో మరో అల్పాతి అల్పమైన ప్రాణివిగానో
కడగట్టుకపోయే ఊపిరియై అలమటిస్తావు

లిప్తకాలిక ఉద్వేగభరిత భ్రమ

నదులన్నీ సముద్రోపగతమయినట్లూ
జీవితం ఒక్కబాటగ కలగలసి కొనసాగుతున్నప్పుడూ
రాముని ధనుష్టంకారమే లీలగా
కనులముందర యుగధర్మమై సాక్షాత్కరిస్తున్నప్పుడూ
నువ్వు నిలుచున్న నేల
నిన్ను ఒక మామూలు చూపుతో అనుమానితునిగా నిర్ధారిస్తున్నప్పుడూ
నీకు అవతలగా నువ్వు ఏది మాత్రం రాయగలవు

ఇది మహాయుద్ధం

నువ్వు ఎక్కుపెట్టిన బాణానికి గురిగా ఎప్పటిలాగే ఇంకో నువ్వు

ఇది నిన్ను నువ్వు ఖండఖండాలుగా తెగనరుకుకొని
తిరిగి మళ్ళీ నెమ్మదినెమ్మదిగా ఒక్కొక్క ముక్కనూ తెచ్చి అతికించుకునే
బీభత్సకర అతి సృజనాత్మక జీవన దృశ్యం

తెలిసితెలిసి ఒక మాటకు ఇంకో మాట బదులిచ్చినంత తేలికగా
ఒక పద్యాన్ని రాయడం –

రాస్తూ రాస్తూ ఉండగానే
ఈ చేయి రెండు పీలికలుగా విడిపోయి నిన్ను నిస్సహాయుడిని చేయడం –

ఇది తరాలతరబడి కొనసాగుతున్న పోరాటం

రాముడు సర్వాంతర్యామియే కాదు
ఆయన బహురూపి
హనుమంతుడి హృదయ పటంపై కొలువుండినట్లుగానే
ఇదిగో ఇక్కడా వాని సంతకం