నాయన

చావు
ఒక విశ్రాంతిగీతంగానూ
చాచిన చేతికేదీ తగలని భయదశూన్యంలానూ
నీ వల్లే తెలిసింది నాన్నా
నీ వల్లే తెలిసింది

చావు
ఇక్కడినుంచీ అలిగి వెళ్ళిపోయే కోపగృహంగానూ
కొనప్రాణంలో కొట్టుకలాడే ఊపిరిచిరునామగానూ
నీ వల్లే తెలిసింది నాన్నా
నీవల్లే తెలిసింది

చావు
ఎన్నాళ్ళో నుంచో లోపల కనలే అగ్నికీలగానూ
ఎప్పటినుండో ఎదురు చూస్తున్న చల్లని ఓదార్పు స్పర్శగానూ
నీవల్లే తెలిసింది నాన్నా
నీవల్లే తెలిసింది

చావు
ఎన్నాళ్ళనుంచో పేరుకపోయిన వైరాగ్యంగానూ
పట్టుకుని నడిపించే వేలికొసలనుంచీ ఎక్కడతప్పిపోతామోనన్న తెలియని భయంగానూ
నీవల్లే తెలిసింది నాన్న
నీవల్లే తెలిసింది

చావు
మనిషి నడచే దారులెంట విడదీయజాలని బతుకుమర్మంగానూ
పదునంచులపై జాగరూకమై దొమ్మరి చేసే విన్యాసంగానూ
నీవల్లే తెలిసిందినాన్నా
నీవల్లె తెలిసింది

Agony

పోనీయ్
పురామానవుడొకడు బొట్టుబొట్టుగా తన దేహాన్నిమన్నులో  కలిపి ఆకుపచ్చని కలయి  పైకిలేచి తిరిగి  ఆ మన్నులోనే బీటలువారి ఎండి  కొద్దికొద్దిగా ఇంకిపోనీ

పోనీయ్
సహస్త్ర వృత్తుల శ్రమన్నినాదం బొంగురువోయిన గొంతుకలో ఆరని కీలగా ఎదిగి  భగ్గున మండి అక్కడే నిలువెత్తు బూడిదై గాలిలో కలిసిపోనీ

పోనీయ్
దీర్ఘనిద్రలోనూ అవిశ్రాంతమై దిక్కులవిసే రోదనతో బీభత్సగీతికా రాగాలను పాడే అస్థికా మూలాలను అలాగే కొద్దికొద్దిగా చివరకు అణగిపోనీ

పోనీయ్
బతుకు కష్టమై ఇంటికితిరిగిపోతే బిడ్డల ఆకలికి ఏ జవాబు చెప్పలో తెలియక మొకాన గుడ్డనడ్డంపెట్టుకొని ఒక్కడై వెక్కివెక్కి రోదించిన నాయనలాంటి నాయననాయన లాంటి వాళ్ళ దుఃఖాలు గడ్డకట్టి శిలలలో శిలలుగా కలసిపోనీ

పోనీయ్
బతకడం చేతకాక, కూచోని కాలుమీదకాలేసుకొని అధికారం చెలాయించడం చేతకాక,  కనీసం దబాయించడమైనా చేతకాక, కష్టాన్ని  నమ్ముకుని  ఏ పూటకాపూటగా బతికే అలగా జనమంతా ఒక్కొక్కరూ తలలమీద మోయలేనిబరువులతో, మండే నిప్పుల గుండమై, అది ఎటు దహిస్తుందో తెలియక- దారులెంటా, మాటలెంటా, చేసే చేతలెంటా కట్లుతెగి  మహా విలయమై నలుమూలలా చెదరిపోనీ

వృద్ధాప్యం

ఒక మూల కూర్చోవాల్సిన వయసు-
వొచ్చిన పెన్షన్ డబ్బులు అడిగిన వాళ్ళకు అడిగినట్టుగా ఇచ్చి కాసిని నీళ్ళు నా మొకాన పోయండ్రా అని దేబిరించుకోవాల్సిన వయసు.
ఈ నా కొడుకులతో ఇస్తే ఒక దెంగులు, ఈయకపోతే ఒక దెంగులు.
చేసినన్నాళ్ళూ చేస్జేసి వొచ్చిన ఆ పెన్షన్ డబ్బులు గూడా చిల్లి గవ్వ జేబిలో పెట్టుకోకుండా ఈళ్ళ మొకానకొడితే తిరిగి జూసే నా కొడుకులేనా ఈళ్ళు

ఆకరుకు ఒక మాట మాట్టాడే దిక్కు లేరు నాయనా
ఈసురోమని వచ్చే పొయ్యే మొకాలకేసి చూస్తా ఉండాను
మోకాళ్ళు వంగవు, కాస్త కాళ్ళూ కదుపుదామంటే నడుం సహకరించదు
ఎక్కడా ఒక్క పలకరింపు దొరకదు
లోపల పొంగే సముద్రపు రొద

ఊరకుక్కకిదిలిచ్చినట్టూ ఇదిలిస్తారయ్యా నాలుగు మెతుకులు
సాకి సంతరిచ్చి ఇంతోళ్ళను జేసినందుకు రవ్వంతన్నా దయ లేదు తండ్రీ
దిక్కుమాలిన దేముడన్నా తొందరగ దయజూపి దెంక పోడేమి నాయనా !

ఒక రోజు గడవడం

౧.ఎప్పటిలాగే ఉదయం :
నిర్ణయాలన్నీ ఎప్పటికప్పుడు ఎలా తారుమారవుతాయో ఆలోచిస్తూ ఉండగనే
చేజారి భళ్ళున ఎక్కడో బద్దలవుతుంది

ఊపిరి వెన్నులో గడ్డకట్టి
తీగలు తెగిపోతూ మిగిలిన శబ్ధ స్థంబన ఒక్కటే ఇక దేహమంతా

ప్రేమలు లేవు
లేత రంగుల అల్లికతో గాఢంగా పెనవేసుకునే సంస్పందనల
ఉదయాస్తమయ జమిలి మేలిమి అనుభూతులు లేవు
సున్నితమైనవన్నీ ఒక్కొక్కటీ
రెక్కలు విరిగి –

ఈ క్షణం ఇది మూలాల కుదుళ్ళను
తలకిందులు చేసి సుడివేగంతో ఎక్కడికో విసిరివేసే పెను ఉప్పెన

మనుషులు ఎందుకింత యాతన పడాలో
ఈ శాపాన్ని తలదాల్చి ఎన్నాళ్ళు ఇలా మోయాలో

౨.పగటి పూట :
ఈ దారులకు అలవాటయిన పాదాలు

ఎక్కడికెక్కడికో కొనిపోతూ; నువ్వు నడుస్తున్నప్పుడు ఎచటికో తెలియని నీ పయనాన్నీ,నిన్నూ అన్నీ తెలిసిన ఒక తల్లి, బిడ్డను తన చేతులలోకి సుతారంగా తీసుకున్నట్టుగా
తన లోనికి, తన శరీరంలో శరీరంగా తనలోనికి తీసుకొని దారులన్నీ నీతో నడుస్తూ ఉన్నప్పుడు –

కాసేపు నువ్వు వెక్కివెక్కి ఏడ్చే చంటి బిడ్డవు. తెలియని దన్ను ఏదో ఒక ఎరుకగా నీలో నీకే పొటమరించిన తల్లి చన్నయినపుడు నువ్వే ఒక ఓదార్పు మాటవు. నీ చుట్టూ నువ్వే అనేక యుద్ధాలను అల్లుతూ, ఉన్నవి నీకు రెండు చేతులేనని సమయానికి గుర్తురాక చివరకు వేసటపడీ, అలసీ,నీ నీ పైన నువ్వే గురి చూసుకొనే నిర్ధాక్షణ్యతవు

౩.రాత్రి :
ఉన్నది ఇక కేవలం అలసట

గుడ్డి దీపం వెలిగించిన ఒక గుహ-
నెత్తురు కరుడు కట్టి కొసలపై తడి ఆరని రాతి ఆయుధాల చీకటి కారడివి-
ఏ యుగమో తెలియదు
ఈ రాతిరికిక ఈ ఆదిమ మానవుడు నిదురించాలి