మానవజన్మమిది తండ్రి

చివరికిక ఏమవుతుంది

ముఖంపైని మృదుత్వం లాగే లోలోపలి తడి క్రమేపీ ఆవిరవుతూ

ఒక దుఃఖపు నిట్టూర్పులా అలాగే ఉబికివచ్చి చివరకు అలాగే ముగిసిపోతూ

అనుభూతిలో తప్ప అర్థమవనిదొకటి ఊరికే నిర్లిప్తంగా

చివరకిక ఏమవుతుంది

అంతా అలవాటు ప్రభూ

అంతా అలవాటు

ఇంకా ఏదోమిగిలేఉన్నట్టూ

గత కాలపు గురుతులనుంచీ ఈ ప్రయాణం ఇలా అవిచ్చిన్నంగా కొనసాగుతూ ఉన్నట్లూ

లేదా ఓ కొత్తదేదో ఇపుడే ఆవిష్కారమై బతుకును మునుముందుకు నడిపిస్తున్నట్టూ

క్షణం తీరికలేని పనుల చుట్టూ గిరాగిరా తిరిగే రంగుల లోకం

ఈ జీవికి ప్రశాంతి ఎక్కడ

తచ్చాటల నడుమ పెళుసుగ ఎక్కడికక్కడ విరిగిపోతూ

దాహార్తి తీరని మాటల వ్యక్తీకరణలు

కేవలం మాటలు

మాటాడితేతప్పా అరిచి గీపెడితేతప్పా ఒకరికొకరు కనీసం ఉన్నట్టుగా తెలియని అంధకారపు తడుములాట

మాటాడీ మాటాడీ చివరకు అసహనంతో దారీతెన్నూలేక

అంతా అగమ్యగోచరమై చివరకు హింసాత్మకంగా

ఏదో ఉంది, మనలోనే కొంచెం కొంచెం కొరుక్కుతిని

ఒక అస్థిత్వ ప్రకటనలా నిరంతరం స్రవించే గాయాల నది ఒడ్డున

అలసి ఆ క్షణానికి సుషుప్తిలో సేదతీరే

వెంటాడే స్వీయ హింసగా

చెప్పాలని ఉంటుంది,అయితే వెనకాలే ఎప్పటికీ చెదరని ప్రశ్న

ఎవరికైనా మరొకరు ఎంత మాత్రం అర్థమవుతారు?

రోడ్లను నిలేసి అడిగినంత తేలిక కాదు

ఇదే మాట మరొకరెవరన్నా అంటే ఈ క్షణానికి ఎక్కడన్నా దూకి చచ్చిపోయేంత నిసృహ

అప్పుడప్పుడూ అనిపిస్తుంది నాకొడకల్లారా నేనొకడ్ని ఇక్కడ చచ్చాన్రా అని

దేహాన్ని సర్రున చీల్చి చిరునామాగా ఒక సజీవ స్మారకాన్నినడి రోడ్దు మీద నిలబెడదామని

ఇంతా చేసి చివరకు ఏమవుతుంది

జీవి ఆక్రందన ఏ మహోన్నత దుఃఖ సముద్రాల అలలపై సేద తీరుతుంది

నిట్టూర్పు ప్రభంజనమై ఏ విశ్వ తంత్రులను మీటబోతుంది

ఒంటరి ఈ పాటకు ఏ మూర్తి వేయి సహ గొంతుకలుగా శృతి కలపనుంది

చివరికిక ఏమవుతుంది

దిమ్మరి

నడిచే పాదాలవెంట తెరుచుకునే దారులేమిటి
ఇక్కడ కరిగి మరెక్కడకో దారితీసే
ఈ క్షణానికి తుది ఏమిటి

రోజూ నడిచే దారులే
అన్నీపరిచయమున్న ముఖాలే

అయినా అడుగు తీసి అడుగు వేసేసరికి
ఎప్పటికప్పుడు నోరు తెరిచే తెలియని కీకారణ్యాలు

ఏది ఎలా రూపొందుతూ ఉంటుందో తెలియదు
కనిపించే రూపం వెనుక తొలచుకుని పెరిగే ఏదో ఊహించని
మాయా మంత్రజాలం

అయినా చివరకు ఏమవుతుంది

ముసిరే దుఃఖం వెనుక మృత్యువు
పగిలే ఒత్తిడి వెనుక మృత్యువు
వీడని అన్వేషణల వెనుక మృత్యువు
సాగే జాడల వెనుక మృత్యువు

సదాసదాసదా మృత్యువుమృత్యువుమృత్యువు

అయినా చివరకు ఇంతకు మించి మరేమవుతుంది

తెలిసిన ముఖాలలో తెలిసిన దారులలో
తెలిసినట్టే ఉండి తెలియని దాన్ని, ముసుగులా కనిపించీ కనిపించనిదాన్ని
ఎప్పటికది భారమై భళ్ళున చేజారుతుందో తెలియనిదాన్ని
నువు ఎలా సంబోధించి, ఏమని పూరిస్తావో కదా ఈరోజుని

ఎల్లెడలా పరివ్యాపితమైన మృత్యువుకు
మనుషులు అనేకానేక నీడలుగా
కవీ దిమ్మరీ
మానవుడా మానవుడా