సమాధుల తోట

మాటలతో ఏమీ చెప్పజాలని అశక్తతలాగే
వెనుకకు తిరిగి చూసినపుడు రాసిన పద్యాల జాడలవెంట
కాంక్షించినదేదీ పలుకని తిరస్కృతిలా
ఎక్కడో దారితప్పి తనచుట్టూ తాను
తిరిగి తిరిగి వేసారే పాదాల వేదనా తీరం

ఇక్కడ ఏమీ మిగిలిలేదు

చేయి చాచిన ప్రతిసారీ అశక్తత ఒక్కటే ఒక శూన్యపు స్పర్శగ
సదా మస్థిష్క గోళాంతరాలలో
మహా భారమై రేగే అగ్నికణికలు తప్ప

జీవితం వాళ్ళకు ఎంత అల్పం

అల్పమని తెలిసి మరింత ఒదిగి ఒదిగి
భయముతో వేసటతో
ఒక మహా పర్వత సదృశ్యమైన దేన్నో
మూపులపై తప్పించుకోజాలక శృంఖలాబద్ధమయి
మనుషుల అసహాయ విన్యాస కేళీ విలాపం

అనాదిగా వాళ్ళకు తెలిసిందొక్కటే

చావు తప్ప మరొకటింకేదీ
జీవితపు తొక్కిళ్ళ నుండీ విముక్తి నివ్వదని

అరచేతుల మడతలలో బిరుసుబారి కఠినాతికఠినమై
చివరకు అరగడంతప్ప మారని బతుకురాతను
చచ్చేంతదాకా అలా పొడిగించక తప్పదని

“మంచి మంచి వాళ్లకు చావొస్తుంది నాకొచ్చి చావదేమండ్రా”ని
ఊపిరి సలుపని ఆక్రోషంలో తనను తాను దహించుకుంటూ
ఈసురోమని తిరిగి లేస్తూ తప్పించుకోజాలని
అరవై ఏళ్ళ జీవితానికి ముగింపునొక ఆశ్వాసనగా
తలపోసి తలపోసి చావు ఎంత బాధాకరమైనా
తిరిగి చూడని నాయన-

మగ్గపు చప్పుళ్ళ మధ్య నిర్లిప్తత ఒక మత్తుగా మరిగి
నిరంతరమూ ఊళ్ళు పట్టుకుని నాడెలా సంచలించిన ఆయన తండ్రి

బతుకంతా ఆసులో దారమై
ధారవాహికంగా ఎనబై ఏళ్ళపైబడి రెక్కలను సాది
అక్షరాలా అరిగి బొగిలిపోయిన జేజి

భారమై మలిగిపోయే శ్వాస కొసలలో
రగిలిన అనేకపు నిప్పుపూలు

అనామకపు ఖాళీలనడుమ
ఎక్కడో కాలపు పొరల మాటున
ఎదురుచూస్తున్నదేదో తమకు సిద్ధించినట్టుగా
విశ్రాంతిలో పరుండినవాళ్ళను
ఇప్పుడు నేను పేరుపెట్టి పిలువబోను

తెలిసి తెలిసి
ఒక విఫల నిష్ఫల గీతికా చితినై
నిరంతరమూ నన్ను నేను దహించుకోలేను

నీకొక కవిత బాకీ

కొన్ని పదాలను పేర్చి వాక్యాల పొత్తిళ్ళలో
ఒక చిన్న మొక్కను
తన లేతపాటి ఆకులతో మృదువుగా చేతులు చాచే ఒక చిన్న మొక్కను నిర్మించగలమా?

బండబారిన ఈ చేతులతో
రోజూవారీ అనేకానేక చర్యలతో పలుమార్లు మృతప్రాయమై
దేహానికి ఇరువైపులా రెండు కట్టెల మాదిరి వేలాడే ఈ చేతులతో
దినానికొక్కతీరై పైపైకి సాగే ఒక చిన్న మొక్కను ఊహించగలమా?

ఎప్పుడో కొన్ని యుగాలకావల
ఙ్ఞాపకాల పొరల లోతుల్లో ఒత్తిగిలి
తన చేతులతో నాటిన ఓ చిన్ని మొక్కను
ప్రతి రోజూ లేచీ లేవగనే పక్కబట్టల మీదనుంచి పైకురికి
తనదైన ఆ చిన్ని అద్భుతం ఆ రోజుకుగాను
పచ్చని పలకరింపై ఏ మేరకు విస్తరించిందోనని
ఎదిగే ఆ పసిమి లోకం ముందర మన్నులో గొంతుకూర్చొని-

ఇప్పుడు ఈ చేతులలో
ఆకుపచ్చనివేవీ పురుడు పోసుకోవు
నీటితో తడిసి గాఢతనలుముకునే మట్టి చారికలేవీ మిగిలిలేవు

ఇది ఒక శుష్క ప్రయత్నం

ఒక బాల్యంలాంటి
అటూ ఇటూ పరిగెత్తుతూ, అప్పుడప్పుడూ పాల తుత్తర తీరని ఏనాటివో స్మృతులతో
అమ్మ పాలిండ్లపై గారాంగా మెత్తగ తడిమే పాపాయి చేతుల లాంటి
అపురూపమైనవేవీ ఈ కవితలలో పలకవు
చెక్కిళ్ళ మీద జారిన పాలచారికలలాంటి ఙ్ఞాపకాలనేమీ ఈ పదాలు పుక్కిట పట్టవు

కవిత్వం

ఎగిరే సీతా కోక చిలుకల రెక్కల చప్పుడు

ఏకాంతం

 

దిగంతాలకు విస్తరించిన కనుదోయి చూపు

పాట

 

చెట్లు గుబురులెత్తే కాలంలో గాలిలో కలగలసిన సుతిమెత్తని ఆకుపచ్చ పరిమళం

ఊహ

 

అనంత దూరాల యానంలో నిరంతరమూ సాగే కాంతి వేగాల జలపాత ఉరవడి

కవిత

 

రాలి పడిన పూవుల దుఃఖాన్ని వేలి కొసలకెత్తి దేహానికలుముకునే గంథలేపనం

మనిషి