నాయన

చావు
ఒక విశ్రాంతిగీతంగానూ
చాచిన చేతికేదీ తగలని భయదశూన్యంలానూ
నీ వల్లే తెలిసింది నాన్నా
నీ వల్లే తెలిసింది

చావు
ఇక్కడినుంచీ అలిగి వెళ్ళిపోయే కోపగృహంగానూ
కొనప్రాణంలో కొట్టుకలాడే ఊపిరిచిరునామగానూ
నీ వల్లే తెలిసింది నాన్నా
నీవల్లే తెలిసింది

చావు
ఎన్నాళ్ళో నుంచో లోపల కనలే అగ్నికీలగానూ
ఎప్పటినుండో ఎదురు చూస్తున్న చల్లని ఓదార్పు స్పర్శగానూ
నీవల్లే తెలిసింది నాన్నా
నీవల్లే తెలిసింది

చావు
ఎన్నాళ్ళనుంచో పేరుకపోయిన వైరాగ్యంగానూ
పట్టుకుని నడిపించే వేలికొసలనుంచీ ఎక్కడతప్పిపోతామోనన్న తెలియని భయంగానూ
నీవల్లే తెలిసింది నాన్న
నీవల్లే తెలిసింది

చావు
మనిషి నడచే దారులెంట విడదీయజాలని బతుకుమర్మంగానూ
పదునంచులపై జాగరూకమై దొమ్మరి చేసే విన్యాసంగానూ
నీవల్లే తెలిసిందినాన్నా
నీవల్లె తెలిసింది

1 thoughts on “నాయన

  1. మీ యీ కవితలో మీరు క్రింద వ్రాసినట్లు ప్రతీ తఫా
    “నీవల్లే తెలిసిందినాన్నా
    నీవల్లె తెలిసింది”
    అని అనడం వల్ల రిపిటీషన్ జరిగి చదవడానికి కొంచెం
    ఇబ్బందిగా వున్నదనిపించి యీ సలహా.
    ఇలా
    “నాన్నా నీవల్లే తెలిసింది” అని సరిపెడితే …..? . మీరేమంటారు?శ్రేయోభిలాషి నూతక్కి .

వ్యాఖ్యానించండి