DROWSY

చేతులు వేటికవి శరీరం నుండివిడివడుతున్నట్టుగాఅలవాటు లేని కదలికలో మిణుకు మిణుకున పారాడే సన్నని వణుకు
నన్ను నేను అప్పగించుకుంటున్నానులేదా అలవాటు లేని ఒక అశక్తతకుశరీరం ఒదిగి దానికి ఎలా దారినిస్తుందో చూస్తున్నాను
కొన్ని కష్టాలుంటాయికొన్ని కష్టాలలో మునిగి తేలితేనే కానీ ఆ క్షణాన్ని చీల్చుకొని ఒళ్ళంతా పచ్చినెత్తురు పీలికలతో తోచిన పిచ్చి గీతలేవో గీసే అలవి కాని దుఃఖపు వాగులుంటాయి ఆ గీతలలో పదే పదే,  చెప్ప రాక వాగులయి ఉప్పొంగి చివరకు ఆవిరై, బొర్రలు విచ్చుకొని పడుకున్న గుండ్రాతి నిధులుంటాయి
ఇదినాలాగే అలిసితొణకిసలాడే బండి చక్రాల చప్పుడు
ఒక తూగుగా కర్ణ కఠోరమై  చెవులలో  ఏదో రాపిడి జోల  చేతులు చాచిన దారి ఇక ఒక్కటే  –

బంక బేదులు

తెలియని అనేకం కన్నా కించిత్ ఇది సుఖంగానే ఉంది

కొద్దిగా కడుపులో కదలడం, ముక్కుతున్నప్పుడు ముడ్డి పీకుడూ
కొంచెం కష్టంగానే ఉన్నా ఎప్పటికప్పుడు
తెలిసిపోతూ ఉండడం –

తెలియని అనేకానేకం కన్నా
“క్రైం అండ్ పనిష్‍మెంట్‍” సెమ్యన్‍జహరోవిచ్ తాగుబోతు ప్రేలాపనలో
ఏదో  తెలియని కుక్క పీకుడుకన్నా
ఇదే సుఖమనెడి అశక్తతతో పుస్తకాన్ని కాసేపు బోర్లాగా పడుకోబెట్టి
నీరసపు మూగన్నుతో-

తెలియని అనేకానేకం కన్నా తెలుస్తూ ఉండేవాటిలో
సూక్ష్మంలో మోక్షం వెతకడం
ఇప్పుడిప్పుడే ఙ్ఞానోదయమవుతోంది

నాయన

చావు
ఒక విశ్రాంతిగీతంగానూ
చాచిన చేతికేదీ తగలని భయదశూన్యంలానూ
నీ వల్లే తెలిసింది నాన్నా
నీ వల్లే తెలిసింది

చావు
ఇక్కడినుంచీ అలిగి వెళ్ళిపోయే కోపగృహంగానూ
కొనప్రాణంలో కొట్టుకలాడే ఊపిరిచిరునామగానూ
నీ వల్లే తెలిసింది నాన్నా
నీవల్లే తెలిసింది

చావు
ఎన్నాళ్ళో నుంచో లోపల కనలే అగ్నికీలగానూ
ఎప్పటినుండో ఎదురు చూస్తున్న చల్లని ఓదార్పు స్పర్శగానూ
నీవల్లే తెలిసింది నాన్నా
నీవల్లే తెలిసింది

చావు
ఎన్నాళ్ళనుంచో పేరుకపోయిన వైరాగ్యంగానూ
పట్టుకుని నడిపించే వేలికొసలనుంచీ ఎక్కడతప్పిపోతామోనన్న తెలియని భయంగానూ
నీవల్లే తెలిసింది నాన్న
నీవల్లే తెలిసింది

చావు
మనిషి నడచే దారులెంట విడదీయజాలని బతుకుమర్మంగానూ
పదునంచులపై జాగరూకమై దొమ్మరి చేసే విన్యాసంగానూ
నీవల్లే తెలిసిందినాన్నా
నీవల్లె తెలిసింది

Agony

పోనీయ్
పురామానవుడొకడు బొట్టుబొట్టుగా తన దేహాన్నిమన్నులో  కలిపి ఆకుపచ్చని కలయి  పైకిలేచి తిరిగి  ఆ మన్నులోనే బీటలువారి ఎండి  కొద్దికొద్దిగా ఇంకిపోనీ

పోనీయ్
సహస్త్ర వృత్తుల శ్రమన్నినాదం బొంగురువోయిన గొంతుకలో ఆరని కీలగా ఎదిగి  భగ్గున మండి అక్కడే నిలువెత్తు బూడిదై గాలిలో కలిసిపోనీ

పోనీయ్
దీర్ఘనిద్రలోనూ అవిశ్రాంతమై దిక్కులవిసే రోదనతో బీభత్సగీతికా రాగాలను పాడే అస్థికా మూలాలను అలాగే కొద్దికొద్దిగా చివరకు అణగిపోనీ

పోనీయ్
బతుకు కష్టమై ఇంటికితిరిగిపోతే బిడ్డల ఆకలికి ఏ జవాబు చెప్పలో తెలియక మొకాన గుడ్డనడ్డంపెట్టుకొని ఒక్కడై వెక్కివెక్కి రోదించిన నాయనలాంటి నాయననాయన లాంటి వాళ్ళ దుఃఖాలు గడ్డకట్టి శిలలలో శిలలుగా కలసిపోనీ

పోనీయ్
బతకడం చేతకాక, కూచోని కాలుమీదకాలేసుకొని అధికారం చెలాయించడం చేతకాక,  కనీసం దబాయించడమైనా చేతకాక, కష్టాన్ని  నమ్ముకుని  ఏ పూటకాపూటగా బతికే అలగా జనమంతా ఒక్కొక్కరూ తలలమీద మోయలేనిబరువులతో, మండే నిప్పుల గుండమై, అది ఎటు దహిస్తుందో తెలియక- దారులెంటా, మాటలెంటా, చేసే చేతలెంటా కట్లుతెగి  మహా విలయమై నలుమూలలా చెదరిపోనీ

వృద్ధాప్యం

ఒక మూల కూర్చోవాల్సిన వయసు-
వొచ్చిన పెన్షన్ డబ్బులు అడిగిన వాళ్ళకు అడిగినట్టుగా ఇచ్చి కాసిని నీళ్ళు నా మొకాన పోయండ్రా అని దేబిరించుకోవాల్సిన వయసు.
ఈ నా కొడుకులతో ఇస్తే ఒక దెంగులు, ఈయకపోతే ఒక దెంగులు.
చేసినన్నాళ్ళూ చేస్జేసి వొచ్చిన ఆ పెన్షన్ డబ్బులు గూడా చిల్లి గవ్వ జేబిలో పెట్టుకోకుండా ఈళ్ళ మొకానకొడితే తిరిగి జూసే నా కొడుకులేనా ఈళ్ళు

ఆకరుకు ఒక మాట మాట్టాడే దిక్కు లేరు నాయనా
ఈసురోమని వచ్చే పొయ్యే మొకాలకేసి చూస్తా ఉండాను
మోకాళ్ళు వంగవు, కాస్త కాళ్ళూ కదుపుదామంటే నడుం సహకరించదు
ఎక్కడా ఒక్క పలకరింపు దొరకదు
లోపల పొంగే సముద్రపు రొద

ఊరకుక్కకిదిలిచ్చినట్టూ ఇదిలిస్తారయ్యా నాలుగు మెతుకులు
సాకి సంతరిచ్చి ఇంతోళ్ళను జేసినందుకు రవ్వంతన్నా దయ లేదు తండ్రీ
దిక్కుమాలిన దేముడన్నా తొందరగ దయజూపి దెంక పోడేమి నాయనా !

ఒక రోజు గడవడం

౧.ఎప్పటిలాగే ఉదయం :
నిర్ణయాలన్నీ ఎప్పటికప్పుడు ఎలా తారుమారవుతాయో ఆలోచిస్తూ ఉండగనే
చేజారి భళ్ళున ఎక్కడో బద్దలవుతుంది

ఊపిరి వెన్నులో గడ్డకట్టి
తీగలు తెగిపోతూ మిగిలిన శబ్ధ స్థంబన ఒక్కటే ఇక దేహమంతా

ప్రేమలు లేవు
లేత రంగుల అల్లికతో గాఢంగా పెనవేసుకునే సంస్పందనల
ఉదయాస్తమయ జమిలి మేలిమి అనుభూతులు లేవు
సున్నితమైనవన్నీ ఒక్కొక్కటీ
రెక్కలు విరిగి –

ఈ క్షణం ఇది మూలాల కుదుళ్ళను
తలకిందులు చేసి సుడివేగంతో ఎక్కడికో విసిరివేసే పెను ఉప్పెన

మనుషులు ఎందుకింత యాతన పడాలో
ఈ శాపాన్ని తలదాల్చి ఎన్నాళ్ళు ఇలా మోయాలో

౨.పగటి పూట :
ఈ దారులకు అలవాటయిన పాదాలు

ఎక్కడికెక్కడికో కొనిపోతూ; నువ్వు నడుస్తున్నప్పుడు ఎచటికో తెలియని నీ పయనాన్నీ,నిన్నూ అన్నీ తెలిసిన ఒక తల్లి, బిడ్డను తన చేతులలోకి సుతారంగా తీసుకున్నట్టుగా
తన లోనికి, తన శరీరంలో శరీరంగా తనలోనికి తీసుకొని దారులన్నీ నీతో నడుస్తూ ఉన్నప్పుడు –

కాసేపు నువ్వు వెక్కివెక్కి ఏడ్చే చంటి బిడ్డవు. తెలియని దన్ను ఏదో ఒక ఎరుకగా నీలో నీకే పొటమరించిన తల్లి చన్నయినపుడు నువ్వే ఒక ఓదార్పు మాటవు. నీ చుట్టూ నువ్వే అనేక యుద్ధాలను అల్లుతూ, ఉన్నవి నీకు రెండు చేతులేనని సమయానికి గుర్తురాక చివరకు వేసటపడీ, అలసీ,నీ నీ పైన నువ్వే గురి చూసుకొనే నిర్ధాక్షణ్యతవు

౩.రాత్రి :
ఉన్నది ఇక కేవలం అలసట

గుడ్డి దీపం వెలిగించిన ఒక గుహ-
నెత్తురు కరుడు కట్టి కొసలపై తడి ఆరని రాతి ఆయుధాల చీకటి కారడివి-
ఏ యుగమో తెలియదు
ఈ రాతిరికిక ఈ ఆదిమ మానవుడు నిదురించాలి

సమాధుల తోట

మాటలతో ఏమీ చెప్పజాలని అశక్తతలాగే
వెనుకకు తిరిగి చూసినపుడు రాసిన పద్యాల జాడలవెంట
కాంక్షించినదేదీ పలుకని తిరస్కృతిలా
ఎక్కడో దారితప్పి తనచుట్టూ తాను
తిరిగి తిరిగి వేసారే పాదాల వేదనా తీరం

ఇక్కడ ఏమీ మిగిలిలేదు

చేయి చాచిన ప్రతిసారీ అశక్తత ఒక్కటే ఒక శూన్యపు స్పర్శగ
సదా మస్థిష్క గోళాంతరాలలో
మహా భారమై రేగే అగ్నికణికలు తప్ప

జీవితం వాళ్ళకు ఎంత అల్పం

అల్పమని తెలిసి మరింత ఒదిగి ఒదిగి
భయముతో వేసటతో
ఒక మహా పర్వత సదృశ్యమైన దేన్నో
మూపులపై తప్పించుకోజాలక శృంఖలాబద్ధమయి
మనుషుల అసహాయ విన్యాస కేళీ విలాపం

అనాదిగా వాళ్ళకు తెలిసిందొక్కటే

చావు తప్ప మరొకటింకేదీ
జీవితపు తొక్కిళ్ళ నుండీ విముక్తి నివ్వదని

అరచేతుల మడతలలో బిరుసుబారి కఠినాతికఠినమై
చివరకు అరగడంతప్ప మారని బతుకురాతను
చచ్చేంతదాకా అలా పొడిగించక తప్పదని

“మంచి మంచి వాళ్లకు చావొస్తుంది నాకొచ్చి చావదేమండ్రా”ని
ఊపిరి సలుపని ఆక్రోషంలో తనను తాను దహించుకుంటూ
ఈసురోమని తిరిగి లేస్తూ తప్పించుకోజాలని
అరవై ఏళ్ళ జీవితానికి ముగింపునొక ఆశ్వాసనగా
తలపోసి తలపోసి చావు ఎంత బాధాకరమైనా
తిరిగి చూడని నాయన-

మగ్గపు చప్పుళ్ళ మధ్య నిర్లిప్తత ఒక మత్తుగా మరిగి
నిరంతరమూ ఊళ్ళు పట్టుకుని నాడెలా సంచలించిన ఆయన తండ్రి

బతుకంతా ఆసులో దారమై
ధారవాహికంగా ఎనబై ఏళ్ళపైబడి రెక్కలను సాది
అక్షరాలా అరిగి బొగిలిపోయిన జేజి

భారమై మలిగిపోయే శ్వాస కొసలలో
రగిలిన అనేకపు నిప్పుపూలు

అనామకపు ఖాళీలనడుమ
ఎక్కడో కాలపు పొరల మాటున
ఎదురుచూస్తున్నదేదో తమకు సిద్ధించినట్టుగా
విశ్రాంతిలో పరుండినవాళ్ళను
ఇప్పుడు నేను పేరుపెట్టి పిలువబోను

తెలిసి తెలిసి
ఒక విఫల నిష్ఫల గీతికా చితినై
నిరంతరమూ నన్ను నేను దహించుకోలేను

నీకొక కవిత బాకీ

కొన్ని పదాలను పేర్చి వాక్యాల పొత్తిళ్ళలో
ఒక చిన్న మొక్కను
తన లేతపాటి ఆకులతో మృదువుగా చేతులు చాచే ఒక చిన్న మొక్కను నిర్మించగలమా?

బండబారిన ఈ చేతులతో
రోజూవారీ అనేకానేక చర్యలతో పలుమార్లు మృతప్రాయమై
దేహానికి ఇరువైపులా రెండు కట్టెల మాదిరి వేలాడే ఈ చేతులతో
దినానికొక్కతీరై పైపైకి సాగే ఒక చిన్న మొక్కను ఊహించగలమా?

ఎప్పుడో కొన్ని యుగాలకావల
ఙ్ఞాపకాల పొరల లోతుల్లో ఒత్తిగిలి
తన చేతులతో నాటిన ఓ చిన్ని మొక్కను
ప్రతి రోజూ లేచీ లేవగనే పక్కబట్టల మీదనుంచి పైకురికి
తనదైన ఆ చిన్ని అద్భుతం ఆ రోజుకుగాను
పచ్చని పలకరింపై ఏ మేరకు విస్తరించిందోనని
ఎదిగే ఆ పసిమి లోకం ముందర మన్నులో గొంతుకూర్చొని-

ఇప్పుడు ఈ చేతులలో
ఆకుపచ్చనివేవీ పురుడు పోసుకోవు
నీటితో తడిసి గాఢతనలుముకునే మట్టి చారికలేవీ మిగిలిలేవు

ఇది ఒక శుష్క ప్రయత్నం

ఒక బాల్యంలాంటి
అటూ ఇటూ పరిగెత్తుతూ, అప్పుడప్పుడూ పాల తుత్తర తీరని ఏనాటివో స్మృతులతో
అమ్మ పాలిండ్లపై గారాంగా మెత్తగ తడిమే పాపాయి చేతుల లాంటి
అపురూపమైనవేవీ ఈ కవితలలో పలకవు
చెక్కిళ్ళ మీద జారిన పాలచారికలలాంటి ఙ్ఞాపకాలనేమీ ఈ పదాలు పుక్కిట పట్టవు

కవిత్వం

ఎగిరే సీతా కోక చిలుకల రెక్కల చప్పుడు

ఏకాంతం

 

దిగంతాలకు విస్తరించిన కనుదోయి చూపు

పాట

 

చెట్లు గుబురులెత్తే కాలంలో గాలిలో కలగలసిన సుతిమెత్తని ఆకుపచ్చ పరిమళం

ఊహ

 

అనంత దూరాల యానంలో నిరంతరమూ సాగే కాంతి వేగాల జలపాత ఉరవడి

కవిత

 

రాలి పడిన పూవుల దుఃఖాన్ని వేలి కొసలకెత్తి దేహానికలుముకునే గంథలేపనం

మనిషి

 

అసమ్మతి

ఎక్కడో ఇరుక్కొని ఉంటాము

పాతబడి దుమ్ముబారి పెళుసులుగా విరుగుతున్న
గోదుమరంగు పేజీల నడుమ
చిన్నప్పుడెప్పుడో దాచుకున్నవన్నెల  నెమలి కన్నులా

ఎప్పటిదో ఒక పాటలా
గొంతుకలో  ఉండీ ఉండీ ఊరుతుంటాము

సుడి తిరుగుతూ ఒక జీరగా
క్షణ మాత్రమే అయినా అప్పటికది
మన లోపలి బీటలు వారుతున్న ఏకాంత గృహంలో
మనకు తెలియకుండానే  పెరిగి ఒక పలకరింపై
మెల్లగ తలనూచే గడ్డి పువ్వులా

ఏవో  తెలియని గాయాలతో
సంచరిస్తూ ఉంటాము

బొటనవేలు పగిలి
చిత్తడయిన పాదాల ముని వేళ్ళతో
ఒక సలపరాన్ని దారి పొడువునా అద్దుతూ
కొనసాగడమొక్కటే ఉపశమనమై జ్వలించీ జ్వలించీ
నెమ్మదినెమ్మదిగా బూడిదబారే వేయి తలల మహా కేతనంలా

ఎప్పుడూ మనం ఎదురీదుతూనే ఉంటాం

కృతకత్వమొక్కటే క్షణానికొక్క ముఖంగా
జగన్మోహనమై ఎల్లెడలా పరివ్యాపితమయ్యే వేళల
శిథిలమై విరిగిపడే ఒక మహా వృక్షపు
పెళపెళారావంలో లయమొందుతున్న ఆత్మలా